అమ్మలకు అమ్మ

అమ్మలకు అమ్మ!


 



 


ఒక మహిళామూర్తి పరిచయం కాదిది. మనకు తెలియని మన అమ్మలక్కల జీవితాన్ని తెలియజెప్పే మానవతావాది జీవన స్పర్శ ఇది. అమానుషంగా తొలగిస్తున్న గర్భసంచుల గురించి అలుపెరుగకుండా పోరాడిన సాహసి ఈ అమ్మ. ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి, వేలమంది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచిన నిండు మనిషి ఈ తల్లి.  డా.సామవేదం వేంకట కామేశ్వరి జీవితం తల్లుల చుట్టూ  తిరుగుతున్నది. 


గర్భసంచి, గర్భధారణ  ఈ రెండిటినీ మహిళల సమస్యలుగా చూసే సమాజంలో డా. సామవేదం కామేశ్వరి ఒక మెలకువ తెచ్చారు. స్త్రీ  అంటే ఒక అవయవం కాదని ఎలుగెత్తి చాటారు. పునరుత్పత్తి యాంత్రిక విషయం కాదని నొక్కి చెప్పారు. గైనకాలజిస్ట్‌గా వైద్య వృత్తికి ఒక కొత్త అర్థాన్ని చూపిన  డా. కామేశ్వరి రెండు దశాబ్దాల కృషే ఆమెను అమ్మలకు అమ్మను చేసింది. డా.కామేశ్వరి మహిళల అరోగ్య సూచిక అయిన గర్భ సంచి తొలగింపులకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. సంతాన సాఫల్యం ఒక వ్యాపారంగా మారిన సమాజంలో... మహిళల కడుపు పంటకోసం ఎంతో ఆర్తిగా వైద్యం చేస్తూ... సంసార జీవితాల్లో కలతలు లేకుండా చేస్తున్నారు. ఆమె కృషి కారణంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో సుమారు పదివేలకు పైగా తల్లులు పిల్లాపాపలతో నేడు ఆనందంగా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు ఇరవై లక్షల మంది మహిళలకు జరిగిన అన్యాయం గురించి, వారి జీవించే హక్కుకు కలిగిన భంగం గురించీ ప్రపంచానికి వెల్లడి అయిందీ అంటే, అది ఆమె పోరాట ఫలమే.


కడుపుకోతలపై పోరాటం


ఆరోగ్య సూచిక లాంటి గర్భసంచిని అమానుషంగా తొలగించే వైద్య-వ్యాపార ధోరణిపై డా.కామేశ్వరి చేసిన పోరాటం మూడు విధాలా విశిష్టమైన ఫలితాలు తెచ్చింది. ఒకటి, పెద్ద ఎత్తున డబ్బు ఆశకు వైద్యులు చేసే హిస్టరెక్టమీ ఆపరేషన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగింది. ఆ తర్వాత, గర్భసంచిని కోల్పోవడం వల్ల మహిళలు ఎదుర్కొనే దుష్పరిణామాలపై అవగాహన పెంచగలిగింది. ముఖ్యంగా వృద్ధ్దాప్యంలోకి అడుగుపెడుతున్న మహిళలకు డా.కామేశ్వరి నెలకొల్పిన శిబిరాల వల్ల ఎంతో మేలు కలిగింది. గర్భ సంచి తొలగింపు ఎంతటి దుర్మార్గమైన విషయమోసమాజానికి తెలియజెప్పడంలో ఆమె ప్రయత్నం ఫలించింది. ఆమె సాగించిన లోతైన అధ్యయనం, ఆమె రూపొందించిన క్షేత్ర స్థాయి నివేదికలు, ఆమె నిర్వహించిన  శిబిరాలు, ఆమె ప్రచురించిన పుస్తకం- అన్నీ కలిసి పెనుమార్పును తీసుకువచ్చాయి. 


 


వ్యాపా ర వైద్యానికి వ్యతిరేకంగా


తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, పుండు కావడం- ఇలాంటి సమస్యలతో బాధపడే మహిళలు చికిత్స కోసం సహజంగానే డాక్టర్ల వద్దకు వెళ్తారు. దాన్నే అవకాశంగా తీసుకుని కొందరు స్వార్థపరులు గర్భసంచి తొలగించడం మొదలెట్టారు. ఒకరకంగా వారు మహిళల ఆయువుకే ముప్పు తెచ్చారు. నిజానికి పిండ దశ నుంచి పాపాయిగా మారేంత వరకు గర్భసంచికి ఎంతో ప్రాధాన్యం ఉందని డా.కామేశ్వరి వివరించారు. ‘పాపాయి పెరగడానికి సరిపోయే వాతావరణాన్ని, ఆహారాన్ని, ప్రాణవాయువును అందిస్తూ మానవ మనుగడకే మూలంగా ఉంటుంది గర్భసంచి. అలాంటి అవయవాన్ని మనిషికి మొదటి ఇల్లు అనాలి. డబ్బు ఆశకు వైద్యులు దాన్ని కూల్చేయడం నన్ను కలత పెట్టింది. అదీ, చిన్న చిన్న కారణాలతో. దాంతో 18 నుంచి 42 ఏండ్లు గల సుమారు ఇరవై లక్షల మంది స్త్రీలు ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌ దశలోకి నెట్టబడ్డారు. గర్భాశయాలు తొలగించడంతో నూటికి 33 శాతం మహిళల్లో అండాశయాలు కూడా పనిచేయని స్థితి వచ్చింది. దాంతో అటు సంతానానికి దూరంగా, ఇటు సంసారానికి భారంగా మారారు. ఫలితంగా కళ్ళు, చర్మం, ఎముకలు, గుండె అన్నిటికీ ప్రమాదం నెలకొంది’ అని ఆవేదన వ్యక్తం చేస్తారు. 


 అదే తొలి విజయం


‘2001లో తొలిసారిగా మెదక్‌ జిల్లా సదాశివపేటలోని ఒక స్పిన్నింగ్‌ మిల్లులో 300 మంది మహిళా కార్మికులకు పరీక్ష చేయడంతో... అందరికీ గర్భసంచి తొలగించిన విషయం నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి మొదలైన పోరాటం... 2011లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అధికారికంగా ఈ ఆపరేషన్లను చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. ఆ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తేవడంలో తొలి విజయం సాధించాను. గర్భసంచి తొలగింపునకు గురైన మహిళలకు ఆ దుష్పరిణామాలను వివరించి, వారి జీవన ప్రమాణాల విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడం అన్నది నేటికీ సాగుతున్న మరో అంకం. నిజానికి ఒక స్త్రీగా, వైద్యురాలిగా మహిళల అస్తిత్వాన్ని దెబ్బతీసే ఈ పరిణామాలను నిలువరించడం, స్త్రీల జీవించే హక్కుకు భంగం కలిగించే అంశాలపై పనిచేయడం నా ప్రథమ ప్రాధాన్యంగా మారింది. ఇది ఎంతో తృప్తికరమైన జర్నీ ’ అంటారు ఆమె.


కడుపు పంట- మాతృత్వం  


స్త్రీల సంతానోత్పత్తి ప్రక్రియ యాంత్రికమైన వ్యవహారం కాదు. అది భార్యాభర్తల అనుబంధం, కుటుంబ జీవనం, పరిసరాల ప్రభావం, ఆహారపు అలవాట్లతో కూడిన సంవిధానం. పిల్లలు పుట్టకపోవడానికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన డా.కామేశ్వరి తనను సంప్రదించే దంపతుల ఆరోగ్య పరిస్థితిని లోతుగా విచారిస్తారు. అటు పిమ్మటే వైద్యం ప్రారంభిస్తారు. అందులో ప్రధానంగా స్త్రీ తాలూకు ప్రకృతి ఏమిటి, దానికి కావాల్సిన పౌష్టికాహారం మొదలు ఆరోగ్యకరమైన పరిసర వాతావరణం వరకు అన్నింటినీ బేరీజు వేస్తారు. తగిన సూచనలను ఇస్తూ, నవమాసాలు బిడ్డను మోసే స్త్రీకి కావాల్సిన ప్రత్యేక ఆహారపు అలవాట్లను విశదం చేస్తారు. ‘శరీర నిర్మాణం, శరీర ధర్మం  గురించి దంపతుల దృష్టికి తేవడం సంతాన సాఫల్యానికి మరో ముఖ్యమైన మెట్టు’ అని ఆమె వివరించారు. అలా, డా.కామేశ్వరి వైద్యం అందుకొన్న తర్వాత తొలిసారిగా కాన్పు అయిన వారు పదివేలకు పైనే ఉంటారు. అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో, అతి తక్కువ మందులతో చికిత్స జరపడం డా.కామేశ్వరి ప్రత్యేకత. ‘ఇదంతా, చెప్పినంత తేలిక కాదు. ఎన్నో అవరోధాలను దాటుకుంటూ సలహా సూచనలతో చేయాల్సిన వైద్యం’ అంటారావిడ.