Great city that goes into the Danger Zone with air pollution

 


వాయు కాలుష్యం తో డేంజర్ జోన్ లోకి వెళ్తున్న మహా నగరం



హైదరాబాద్‌ మహానగరం మళ్లీ డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. లాక్‌డౌన్‌ కాలంలో వాహనాల రాకపోకలు తగ్గి వాయుకాలుష్యం చాలా పరిమితంగా ఉండేది. తాజాగా లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకు వచ్చేశాయి. దీంతో గాలి నాణ్యత గ్రీన్‌జోన్‌ నుంచి ఎల్లో, తర్వాత ఆరెంజ్‌లోకి మారుతోంది. లాక్‌డౌన్‌కు ముందు (మార్చి 22కు ముందు) నగరంలోని సనత్‌నగర్‌ ప్రాంతంలో నమోదైన గాలి నాణ్యత 150 (మైక్రో గ్రామ్స్‌ ఇన్‌ క్యూబిక్‌ మీటర్స్‌) గా ఉండేది. ఆ తర్వాత అది 44 స్థాయికి తగ్గి గ్రీన్‌ జోన్‌లో ఉంది. సడలింపులతో వాహనాల రాకపోకలు పెరిగి ప్రస్తుతం 97కు పైకి చేరింది. ఐడీఏ బొల్లారం, పాశమైలారం వంటి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కాలంలో వాయు కాలుష్యం తీవ్రత 100లోపు ఉం డగా.. బుధవారం ఒకేసారి 112 వరకు పెరిగింది.


 గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 6 ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ ద్వారా గుర్తిస్తున్న గాలి నాణ్యత సూచికలు ఎప్పటికప్పుడు వాయు కాలుష్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. ఇక నగరంలో ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలు నడవడం లేదు. దీంతో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. నగరానికి ఉత్తర, పశ్చిమ దిక్కుల్లోనే ఎక్కువ సంఖ్యలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చే వాయు కాలుష్యంతో పోల్చితే వాహనాల నుంచి వెలువడే కాలుష్యమే అధికంగా ఉంటోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 


నియంత్రణ చర్యలు ఎక్కడ?


పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం పెరుగుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లెక్కలు వేస్తున్నా.. దాన్ని నియంత్రించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రవాణా శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారించడం లేదు. వాయు కాలుష్యం మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదమని తెలిసినా దాని నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించే ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచడంలో అంతగా దృష్టిసారించడం లేదు. వాయు కాలుష్య నివారణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదు.