28 people in the same apartment ..

 


ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మందికి..



గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి మాదన్నపేటలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 28 మంది కరోనా బారిన పడటం సంచలనం కలిగిస్తోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ శనివారం నాటికి ఆ సంఖ్య 28కి చేరింది. వీరిలో 11 నెలల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉండటం గమనార్హం. ఒకేచోట ఇన్ని కేసులు నమోదవటం నగరంలో ఇదే తొలిసారి.  అధికారుల యంత్రాంగం వైరస్‌ వ్యాప్తి కారణాలను గుర్తించే పనిలో పడింది. గతంలో కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన మాదన్నపేట కొద్దిరోజుల క్రితమే సాధారణ స్థితికి వచ్చింది. తాజాగా మరోసారి మహమ్మారి విజృంభించటం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, దక్షిణ మండలం జడ్సీ సామ్రాట్‌ అశోక్‌ ఈ ప్రాంతంలో పర్యటించారు.


వేడుకలకు వచ్చిందెవరు?


మాదన్నపేటలోని ఓ ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌లో 15 కుటుంబాలు ఉంటున్నాయి. వీరంతా ఐటీ, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే. ఇంటి నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ కుటుంబంలోని చిన్నారికి ఏప్రిల్‌ చివరి వారంలో పుట్టినరోజు వేడుక నిర్వహించగా కొన్ని కుటుంబాలు పాల్గొన్నాయి. ఆ చిన్నారి తండ్రి వారం క్రితం అనారోగ్యానికి గురయ్యారు. నమూనాలు పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. మర్నాడు చిన్నారికీ సోకింది. అనంతరం ఒక్కొక్కరిలో లక్షణాలు బయటపడ్డాయి. 13 మందిలో వైరస్‌ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అలా మొదట 15 మందికి నిర్ధారణ అయింది. తర్వాత మరో 13 మందికి లక్షణాలు కనిపించాయి. పరీక్షల్లో అందరిలో వైరస్‌ ఉన్నట్లు తేలింది. ఫలితంగా ఆపార్ట్‌మెంట్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 28కు చేరినట్టు వైద్యులు తెలిపారు. ఇంటికే  పరిమితమైన ఇన్ని కుటుంబాలకు వైరస్‌ ఎలా సోకిందనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు. వేడుకలో పాల్గొన్న బంధువులు, స్నేహితులకు  నిత్యావసరాలను సరఫరా చేసిన వారి వివరాలు రాబడుతున్నారు.