కదిలే రైలులో తినడం ఒక అనుభూతి. అయితే కదలకుండా రైలు తరహాలో ఉండే హోటల్ ఒకటుంది. ఇందులో ఇంటిల్లిపాది గంటలకొద్దీ వేచి ఉండి మరీ.. రైలు తీసుకొచ్చే రుచికరమైన మాంసాహారమే కాకుండా శాఖాహారాన్ని సైతం ఆస్వాదిస్తున్నారు. లోపల కూడా క్యాబిన్లు తయారుచేసి కుర్చీలు, ఫ్యాన్లతో నిజంగా రైలులో కూర్చొని తింటున్న అనుభూతిని పొందుతున్నారు. ఆర్డరిస్తే బుల్లి రైలు కూత పెట్టుకుంటూ తమ టేబుల్ వద్దకే వచ్చి అందరినీ అలరిస్తుంది. సరికొత్త విధానంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ఆకట్టుకుంటోంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆలోచన
టీసీఎస్‌లో పనిచేస్తున్న సర్వేశ్వరరావు, వినోద్, మధులు పాఠశాల స్థాయి నుంచే స్నేహితులు. వినూత్నంగా, అందరినీ ఆకట్టుకునేలా ఏదైనా మంచి రెస్టారెంట్ ప్రారంభించాలన్న సర్వేశ్వరరావు ఆలోచన నుంచి వచ్చిందే ఈ హోటల్. జైపూర్ ప్యాలెస్‌లో భారీగా ఉండే రాజు డైనింగ్ టేబుల్‌పైన ఆహారాన్ని అందరికీ అందించేందుకు రైలు ఉండేదని తెలుసుకున్నారు. అనంతరం జర్మనీలో ఇలా బుల్లి రైళ్లు తయారు చేస్తున్నారని తెలుసుకొని ముంబయిలోని ఆ దేశ సాంకేతిక నిపుణులతో రైళ్లు డిజైన్ చేయించారు. ముగ్గురు స్నేహితులు కలిసి దాదాపు రూ.2 కోట్లతో దీన్ని ప్రారంభించారు. కూకట్‌పల్లిలో జాతీయ రహదారి 65 ఆనుకొనే ఈ హోటల్‌ను ఏర్పాటు చేయడంతో దాని పేరును ‘ప్లాట్‌ఫాం 65 రెస్టారెంట్’గా నామకరణం చేశారు.
ఆరు రైళ్లు.. 31 ప్లాట్‌ఫామ్స్
హోటల్ లోపలి భాగాన్ని 4 స్టేషన్లుగా విభజించారు. వీటిని కాచిగూడ, చెన్నై సెంట్రల్, ముంబయి వీటీ స్టేషన్, జర్మనీలోని ఫిన్‌ల్యాండ్ స్టేషన్లను తలపించేలా నిరంజన్, వెంకటేశ్వర కెనడి ఆర్కిటెక్ట్‌ల పర్యవేక్షణలో చెన్నైనుంచి తీసుకొచ్చిన కన్నన్ అనే ఆర్టిస్టుతో తయారు చేయించారు. మొత్తం 31 ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేశారు. అంటే 31 టేబుళ్లు అన్నమాట. ఈ రైళ్లు నడిచేందుకు 787 అడుగుల పొడవైన పట్టాలు ఏర్పాటు చేశారు.