Types and Methods of Red Gram Cultivation

                   కంది సాగులో రకాలు, విధానం 


 


                           

 


        రాష్ట్రంలో కంది దాదాపు 12 లక్షల ఎకరాల్లో సాగు అవుతూ 2.50 లక్షల టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది. ఎకరాకు 2.08 కిలోల సరాసరి దిగుబడిని ఇస్తుంది. పత్తి, మిరప, పొగాకుకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశనగ వంటి పైర్లలో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌లో పండించవచ్చు. అనేక రకాలైన వాతావరణ పరిస్థితుల్లో, వివిధ రకాలైన నేలల్లో విత్తుకునే సమయం కొంచెం వెనుకా ముందు అయినా సాగు చేయడానికి అనుకూలంగా ఉండి దిగుబడినిచ్చే కందిపైరు గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు పరిశీలిద్దాం.


         కందిలో సగటు దిగుబడులు తక్కువగా ఉండటానికి కారణాలు తక్కువ సారవంతమైన, తక్కువ లోతుగల నేలల్లో సాగుచేయడం. రసాయనిక ఎరువులు సిఫార్సుల మేరకు అందించకపోవడం. సేంద్రియ, జీవన ఎరువులు వినియోగించకపోవడం. వర్షాధారంగా సాగుచేయబడటం. తెగుళ్లను తట్టుకునే రకాలు, పంటను ఆశించే పురుగుల నివారణ గురించి సరైన అవగాహన లేకపోవడం. అందుకే కందిని బలమైన నల్ల నేలల్లో సాగు చేస్తే పంటకు అవసరమైన పోషకాలు, తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. దీనితో మంచి దిగుబడులు వస్తాయి. సమస్యాత్మక భూములైన ఆమ్ల, క్షార భూములు కంది సాగుకు అనుకూలం కాదు. నేల తయారీ కోసం వేసవిలో లోతుదుక్కి (9 అంగుళాలు) చేయాలి. తొలకరి వర్షాలకు గొర్రు, గుంటక ఉపయోగించి, నేలను మెత్తగా తయారుచేసుకోవాలి.


రకాలు : యల్‌.ఆర్‌.జి-30, యల్‌.ఆర్‌.జి-38, యల్‌.ఆర్‌.జి-41, డబ్ల్యూ.ఆర్‌.జి-27, ఐ.సి.పి.యల్‌- 85063, ఐ.సి.పి.యల్‌-332, ఐ.సి.పి.యల్‌-87119, యమ్‌.ఆర్‌.జి-66, ఐ.సి.పి.యల్‌-8863 వంటి రకాలు అనుకూలం. ఈ రకాలన్నీ 160-180 రోజుల్లో పంటకు వస్తాయి. వీటిలో శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకొనే రకాలు: ఎల్‌.ఆర్‌.జి-41, ఐ.సి.పి.యల్‌-332. ఎండు తెగులు తట్టుకొనే రకాలు ఐ.సి.పి.యల్‌-87119 (ఆశ), ఐ.సి.పి.యల్‌-8863 (మారుతి). అలాగే వెర్రి తెగులు తట్టుకొనే రకాలు ఐ.సి.పి.యల్‌-87119 (ఆశ), బి.ఎస్‌.ఎం.ఆర్‌-736, బి.ఎస్‌.ఎం.ఆర్‌-853.


విత్తే సమయం, విధానం : నాగలి సాలులోగానీ లేక గొర్రు సాళ్లలోగానీ కంది విత్తవచ్చు. కంది సాగు వర్షాధారంగా చేపడతారు. కాబట్టి విత్తే సమయమూ ఋతుపవనాలను బట్టి ఉంటుంది. తొలకరిలో కంది విత్తడం ఋతుపవనాలను బట్టి జూన్‌ నెల నుంచి మొదలు పెట్టుకోవచ్చు. ఈ నెల మొదట్లో విత్తితే సాళ్ల మధ్య దూరం నేలను బట్టి 1.50 మీ. నుంచి 1.80 మీ. వరకూ ఉండటంతో పాటు సాళ్లలో మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. దూరం ఉండాలి. ఋతుపవనాలు సరిగ్గా లేక విత్తటం ఆలస్యమైతే ప్రతి నెలరోజుల ఆలస్యానికి సాళ్ల మధ్య దూరం సుమారుగా 30 సెం.మీ. వరకు తగ్గించాలి. అలాగే సారము తక్కువగా ఉన్న నేలల్లోనూ సాళ్ల మధ్య దూరం తగ్గించాలి.


విత్తన మోతాదు, శుద్ధి : సాళ్ల మధ్య దూరాన్ని బట్టి ఎకరాకు 2-4 కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది. ఎకరానికి 200-400 గ్రా. రైజోబియం కల్చరు బెల్లం పాకంతో కలిపి విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఇలాచేస్తే గాలి నుంచి నత్రజని పైరుకు అందటానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి ఐదు గ్రా., ఫైటోఫ్తోరా ఎండు తెగులు ఉంటే మెటలాక్సిల్‌ మందును కిలో విత్తనానికి రెండు గ్రా. చొప్పున విత్తనశుద్ధి చేసి, నాటుకోవాలి.


ఎరువులు: ఎకరానికి రెండు టన్నులు పశువుల ఎరువును చివరి దుక్కిలో చల్లాలి. విత్తే ముందు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే రసాయనిక ఎరువులు దుక్కి మీద చల్లాలి. ద్రవరూప జీవన ఎరువులైన అజలో బ్యాక్టరు, ఫాస్ఫో బ్యాక్టీరియాను ఎకరానికి 300 మి.లీ. చొప్పున 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి, విత్తే ముందు దుక్కి మీద చల్లాలి. అప్పుడు పంటకు నత్రజని, భాస్వరం సంబంధించిన పోషకాలు బాగా లభ్యమవడానికి అవకాశం ఉంటుంది.


కలుపు నివారణ : సాధారణంగా విత్తిన 20-25 రోజుల నుంచి అంతరసేద్యం చేయటం ద్వారా కలుపు నివారణ చేయవచ్చు. అంతేకాక కలుపు మందులు ఉపయోగించీ కలుపు నివారణ చేయొచ్చు. ఎకరానికి 1.0 లీటరు ఫ్లూక్లొరాలిన్‌ 45 శాతం మందు విత్తే ముందు నేలపై పిచికారీ చేసి, నేలలో కలిసేలా దున్ని, తర్వాత పైరు విత్తవచ్చు. అలాగే పంట విత్తిన వెంటనే ఎకరానికి 1.0-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ 30 శాతం నేలపైన పిచికారీ చేసి కూడా కలుపు రాకుండా నివారించవచ్చు. నేలపై పొరలలో తగినంత తేమ ఉన్నప్పుడు కలుపు మందులు సమర్థవంతంగా పనిచేస్తాయి. వర్షాలు అధికంగా కురిసి, కలుపు తీయడానికి వీలుకాని సమయంలో ఎకరాకు 250 మి.లీ. ఇమిజిటోఫెర్‌ మందును నాటిన 20 రోజుల తర్వాత పిచికారీ చేసి వెడల్పాకు కలుపును నివారించవచ్చు.


అంతర పంటలు : కంది పంట తొలిదశలో పెరుగుదల చాలా నిదానంగా ఉండి, సాళ్ల మధ్య దూరమూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కందిలో అలసంద, పెసర, వేరుశనగ, సజ్జ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చు. కంది ఎర్రనేలల్లో సాగు చేస్తే బెట్టను తట్టుకునే అలసంద, పెసర, వేరుశనగ, సజ్జ, జొన్న వంటి పైర్లు మాత్రమే అంతర పంటలుగా వేయాలి. బలమైన నల్ల నేలలు, వర్షాలు సక్రమంగా కురిసే ప్రాంతాలలో అధిక ఆదాయాన్నిచ్చే అంతర పంటలు ఎంచుకోవచ్చు. కంది సాళ్ల మధ్య దూరాన్ని బట్టి కంది అంతర పంటల నిష్పత్తిని 1:2 నుంచి 1:7 వరకు నిర్ణయించుకోవాలి.