నృసింహుడు ప్రహ్లాదుడి కథ
ప్రహ్లాదుని పలుకులు యదార్థమని నిరూపించుటకు, హిరణ్యకశిపుని శిక్షించుటకు స్తంభం నుంచి భయంకర రూపంతో బయటికి వచ్చి హిరణ్యకశిపుని వధించాడు నృసింహభగవానుడు. బ్రహ్మాదులందరూ ఆయనను స్తుతించినా, లక్ష్మీదేవి వచ్చి స్తుతించినా ఉగ్రమూర్తియైన స్వామి శాంతించలేదు. బ్రహ్మాది దేవతలంతా ప్రహ్లాదునితో 'కుమారా! నీవే నృసింహ భగవానుని శాంతింపచేయగల సమర్ధుడవు అన్నారు.
అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని సమీపించి సాష్టాంగ నమస్కారము చేసి పలికే పలుకులు అమృతపు చినుకులు, ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడే దివ్వెల వెలుగులు. ప్రహాదుడంటాడు 'ధనము, సత్కులము, సౌందర్యం, తపస్సు, పాండిత్యము, ఇంద్రియ పటుత్వం, తేజస్సు, ప్రతాపము, శారీరక బలం, పౌరుషం, బుద్ధి, యమ నియమాలు – ఈ పన్నెండు గుణాలు ఉన్నా భక్తి లేకపోతే అవి నిష్ఫలమవుతాయి. భక్తి లేని బ్రాహ్మణుని కన్నా భక్తి గల చండాలుడినే నీవు అనుగ్రహిస్తావు. భక్తి కలవాడు కడజాతి వాడయినా వాడి కులాన్నంతా పవిత్రం చేస్తాడు.
భక్తి లేని వాడు ఉత్తమ కులస్థుడయినా వాడు భ్రష్టుడవటమే కాక, వాడి కులాన్నంతా దిగజారుస్తాడు. భక్తిహీనుని కన్నా నీచుడు మరొకడుండడు.
ఇది నిశ్చయము దేవా! నాకు రాజ్యాలు వద్దు. రాజభోగాలు వద్దు. బ్రహ్మలోకాలు వద్దు. నా దాసాను దాసుల పాదాల వద్ద చోటు ఇవ్వు అని అంటూ నృషింహమూర్తిని కీర్తిస్తాడు.
' ఓ ప్రభూ! స్వార్థంతో సేవించే సేవకుడు ఎన్నటికీ విశ్వాసపాత్రుడు కాలేడు. అట్లే తన ఆధిక్యతను నిలుపుకోవటానికి వరాలిచ్చే వ్యక్తి ఎన్నటికీ ప్రభువు కాజాలడు. నేను నీకు నిష్కామభక్తుడను నీవు నాకు నిరుపాధికుడవగు స్వామివి. అంతకుమించి ఇతర భావాలేవీ నాలో లేవు. నీవు నాకు వరాలు ఇవ్వదలచిన యెడల నాలో కోరికలు పుట్టకుండా ఉండే వరాన్నివ్వు. మన భాగవత సప్తాహాలను జరుపుకొంటాం. భాగవత కథలను వింటాం, ప్రవచనాలను శ్రద్ధగా వింటాం, ప్రహ్లాదుని చరిత్ర విని తన్మయత్వం చెందుతాం, కానీ ప్రహ్లాద చరిత్రలోని నీతిని గ్రహించి తదనుగుణంగా మన జీవితాలను మలచుకొంటేనే మనం బాగుపడేది
. అన్నిటికంటే భక్తి ముఖ్యమంటాడు ప్రహ్లాదుడు. సర్వజీవులను సమభావమున దర్శించటమే భగవంతుడిని వశము చేసుకునే సాధన అంటాడు.మనము అసలైన ఆ బోధను గ్రహించక ఎక్కడెక్కడికో పోతాము, నానా అవస్థలు పడతాము. ఏమోమో చేస్తాము. ధనాన్ని, సమయాన్ని వృధా చేస్తాము. అందరినీ, అన్ని జీవులను ప్రేమించటానికి, గౌరవించటానికి ఏమి కావాలి, పవిత్ర హృదయం తప్ప? కోరికలు అనంతం అని తెలిసి, కోరికలే దుఃఖానికి కారణమని తెలిసి, కోరికలతో చేసే పూజ పూజ కాదని తెలిసి వాటిలోనే ఇరుక్కుపోతే శోకసముద్రంలో మునిగిపోతాం. ఏ కరుణా సముద్రుడు మనల్ని కాపాడలేడు నిజం.