'నేను పక్కా ట్రెడిషనల్ ' 'రామచక్కని సీత' ఫేమ్ జ్యోతి
నటనలో నెగిటివ్–పాజిటివ్ షేడ్స్ రెంటినీ ఒకే పాత్రలో పండించగల వెండితెర–బుల్లి తెర నటి జ్యోతి. బాల్యం నుంచీ ఇప్పటివరకు పదిహేనేళ్ళుగా నటిగా 45సీరియల్స్‌లో నటించింది. సింగిల్ టేక్‌లో డైలాగ్‌ను ఓకే చేసే స్థాయికి ఎదిగి నటనలో మంచి అనుభవం సంపాదించుకుందీ గోదావరిజిల్లా నటి. ప్రస్తుతం జీ తెలుగులో 'రామచక్కని సీత' సీరియల్‌లో సీతపాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి రేటింగ్‌తో సాగుతోందీ సీరియల్. 'నేను పక్కా ట్రెడిషనల్, హగ్ సీన్లు అస్సలు చెయ్యను, ఎవరికైనా అదే నా షరతు' అంటున్న జ్యోతి నట ప్రస్థానం.....
జీ తెలుగు టీవీలో 'మంగమ్మగారి మనవరాలు' తర్వాత 'రామచక్కని సీత' సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది జ్యోతి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పుట్టి పెరిగిన జ్యోతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆమె తండ్రి పసుపులేటి ప్రసాదరావు ఫైనాన్స్ బిజినెస్. తల్లి శిరీష. జ్యోతి తండ్రి సినిమాలంటే అస్సలు ఇష్టపడేవారు కాదు. ఆయన కనుసన్నల్లోనే ఎదిగింది జ్యోతి.
తమిళ్ మూవీలో బాలనటిగా కెరీర్ ఆరంభం
బాల్యం నుంచీ అందంగా ముద్దుగా ఉండే జ్యోతిని మంచి నటిని చేయాలని ఆమె తల్లి గాఢంగా కోరుకునేవారు. అందుకు తగ్గట్టే, జ్యోతి తండ్రి తరపు బంధువులందరూ చెన్నైలోనే ఉండటంతో, సెలవులకు జ్యోతి చెన్నై వెళుతూ ఉండేది. చెన్నైలో వాళ్ళింటిపక్కనే సినిమారంగంలో పనిచేస్తున్న మేనేజర్ ఒకరు జ్యోతిని చూసి, 'ఒక తమిళ సినిమాలోకి బాలనటి అవసరం ఉంది, మీ అమ్మాయిని పంపించడానికి మీకు ఆసక్తి ఉందా'' అని అడగడంతో జ్యోతి తల్లి ఎంతో ఆసక్తి ప్రదర్శించారు. జ్యోతి మాత్రం అయిష్టంతోనే వెళ్ళింది. అలా జ్యోతి పదేళ్ళ వయసులో 'తాయిం పాశం' (తల్లిప్రేమ) అనే తమిళ సినిమా షూటింగ్‌లో భయంతో రెప్పలు టపటపలాడిస్తూ, దర్శకుడు చెప్పిన దానికి తలాడిస్తూ, 'తల్లికి దూరమై తీరని ఎడబాటు అనుభవించిన కూతురుగా, అమ్మా, అమ్మా అని పిలుస్తూ, పరుగెత్తుకుంటూవెళ్ళి తల్లిని కౌగలించుకుని కన్నీరుకార్చే దృశ్యం' లో అద్భుతంగా నటించింది.
అసలు కెమేరా అంటే ఏమిటో, సినిమా స్టూడియో అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో పదేళ్ళ వయసులో నటిగా కెరీర్ ప్రారంభించిన జ్యోతి, నటనే తన జీవితంగా మారిపోతుందని, స్టూడియోలే తనకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టే దేవాలయాలుగా మారతాయనీ ఎన్నడూ ఊహించలేదు. ఇప్పటి వరకు పలు చిత్రాలతోపాటు 45 సీరియల్స్‌లో నటించిన జ్యోతి, ఒక్కసారి వెనక్కితిరిగి తాను నడచివచ్చిన దారిని చూసి తానే ఆశ్చర్యపోతోంది. రామచక్కని సీత (సీతపాత్ర), ఎదురీత (సత్యపాత్ర), చంద్రముఖి (వసుధ), మంగమ్మగారి మనవరాలు (సీతామహాలక్ష్మి), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (నందిని), భార్య (ఆనంది).... ఇలా ఏడు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకుంది జ్యోతి. మొదటి సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ఏలూరు వెళ్ళిపోయి చదువులో పడిపోయిన జ్యోతికి వరుస అవకాశాలు రావడం ప్రారంభించాయి. ఈ లోపు తండ్రి ఫైనాన్స్ బిజినెస్ కూడా ఒడిదుడుకులకు లోనవ్వడంతో వ్యాపారం నిమిత్తం ఆయన కూడా కుటుంబ సమేతంగా చెన్నైకి తరలివచ్చారు.
బాల నటిగా 15 సీరియల్స్
ఒకరకంగా చెప్పాలంటే జ్యోతికి బాలనటిగా టీవీ సీరియల్స్‌లోనే ఎక్కువ అవకాశాలొచ్చాయి. ఆ వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ మరోవైపు చదువు కొనసాగించింది జ్యోతి. బాలనటిగా 15 సీరియల్స్ చేసిన జ్యోతి, ఏడు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించింది. అయితే బాలనటిగా ఉన్నప్పటినుంచీ నెగిటివ్ రోల్సే ఎక్కువ చేసింది. పగ ప్రతీకారం తీర్చుకునే పాత్రల్లో నటించేది. అయితే ఆ పాత్రలే ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. జెమినీవారి 'కళ్యాణి' సీరియల్‌లో నెగిటివ్ రోల్ స్నేహపాత్ర జ్యోతికి ఎంతో పేరు తెచ్చింది.
బ్రేక్ ఇచ్చిన తమిళ సీరియల్
సినిమా నటులు సంఘవి, పృథ్విలతో ప్రముఖ దర్శకుడు సి.జె.భాస్కర్ తమిళంలో నిర్మించిన 'గోకులత్తే సీత' (గోకులంలో సీత) సీరియల్‌లో జ్యోతి సాఫ్ట్ కార్నర్ నటనతో ప్రారంభించి విలన్‌గా నెగిటివ్‌లోకి వెళ్ళిన ఒక రోల్ చేసింది. దర్శకుడు కూడా ఆమెకు స్వేచ్ఛనివ్వడంతో, పాజిటివ్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్‌తో రెండు రకాల నటనను అద్భుతంగా పోషించింది. సంఘవి పాత్ర డౌన్ అయినప్పుడు, జ్యోతి పాత్రతోనే స్టోరీ మూవ్ అయ్యేస్థాయిలో గొప్పగా నటించి మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి. రమ్యకృష్ణ సొంత బ్యానర్‌లో 'సంగం' (బంగారం) అనే తమిళ సీరియల్‌లో రమ్యకృష్ణతో కలిసి ముగ్గురు అక్కాచెల్లెళ్ళులో ఒకరుగా చారులత పాత్రలో కూడా మంచిపేరు తెచ్చుకుంది జ్యోతి. రమ్యకృష్ణ తండ్రి ఆమె నటనకు ఫిదా అయిపోయారట. ఆయన స్వయంగా ఫోన్‌చేసి, 'నీకు మంచి భవిష్యత్ ఉంది, గొప్ప నటివి అవుతావు' అని ఆశీర్వదించడం జ్యోతికి ఒక మరపురాని జ్ఞాపకం. ''దేవుడి దయవల్ల నేను ఏ ప్రాత చేసినా అది నాకు మంచి బ్రేక్ ఇస్తూనే వచ్చింది'' అంటోంది జ్యోతి.
మినీ టెలిఫిలిమ్
ఈటీవీవారి 'హడావుడి' అనే మినీ టెలిఫిలిమ్‌లో నటించడానికి జ్యోతి మొదటిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. 'సంగం' సీరియల్‌లో చారులతగా ఆమె చేసిన నటనచూసిన రామోజీరావు కుమారుడు దివంగత సుమన్ ఆమెకు ఈ మినీ టెలిఫిలిమ్‌లో అవకాశం ఇచ్చారు. 'మాతృదేవోభవ'తో మంచి పేరు తెచ్చుకున్న పద్మాచౌదరి ద్వారా జ్యోతికి ఈ అవకాశం లభించింది. ఈ టెలిఫిలిమ్ చేస్తున్న సమయంలోనే జస్ట్ ఎల్లో బ్యానర్‌లో నిర్మించిన 'ఎదురీత' మెగా తెలుగు సీరియల్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత 'చంద్రముఖి' తెలుగు సీరియల్‌లో డ్యుయల్‌రోల్ హీరో పక్కన ఒక హీరోయిన్‌గా వసుధపాత్రలో జ్యోతి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో జీ తెలుగు వారు తమ కొత్త సీరియల్ 'మంగమ్మగారి మనవరాలు'లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సీరియల్లో మనవరాలుగా సీతామహాలక్ష్మి పాత్ర జ్యోతికి లైఫ్‌నిచ్చింది. జీటీవీలో ఈ సీరియల్ ప్రేక్షకజనరంజకంగా 1040 ఎపిసోడ్స్ నడిచింది.
మంగమ్మగారి మనవరాలు పాత్రతో ఎటాచ్‌మెంట్
''నా నిజజీవితంలో నన్ను పోలినట్టుగానే ఉంటుంది 'మంగమ్మగారి మనవరాలు'లో సీత పాత్ర. అందుకే ఆ పాత్రతో నాకు ఎంతో ఎటాచ్మెంట్ ఎక్కువ'' అంటోంది జ్యోతి. రియల్ లైఫ్‌లో జ్యోతి అలాగే ఉంటుందట, అందుకే ఆ పాత్రను ఎంతో ఈజీగా చేసేసిందట. ఈ సీరియల్ పెద్ద హిట్ కావడంతో, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీరియల్‌లో హీరోయిన్ నందిని పాత్ర కోసం ఈటీవీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చింది జ్యోతికి. పాజిటివ్–నెగిటివ్ షేడ్స్ రెంటినీ ఒకేపాత్రలో ఎంతో సమర్థంగా చూపించగలదని జ్యోతి దీంతో మరోసారి రుజువుచేసుకుంది.
కుండబద్దలుకొట్టినట్టు ముందే చెప్పేస్తా!
''తెలుగు, తమిళ సినిమాల నుంచి నాకు చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ వాటన్నింటినీ నేనే వద్దనుకున్నాను. ఎందుకంటే, హీరోయిన్‌గా ఒప్పుకుంటే, కనీసం ఒక్క సాంగ్‌లో అయినా పొట్టిడ్రస్సులు వేసుకుని, అందాలు ఆరబోయాలి. గ్లామరస్‌గా నటించాలి. అలా పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఇష్టంలేకే సినిమా ఛాన్సులు వదులుకున్నాను. రొమాన్స్ సీన్లు ఎక్కువగా ఉంటాయని చెప్పడంవల్ల 'నోట్ బుక్' అనే సినిమాలో అవకాశాన్ని కూడా వదులుకున్నా'' అని చెప్పింది జ్యోతి. వ్యక్తిగతంగా తను చాలా ట్రెడిషనల్‌గా ఉంటుందట. తెరమీద కూడా అలా సంప్రదాయబద్ధంగానే కనిపించాలనేదే జ్యోతి ఉద్దేశమట. అందుకే అలాంటి సంప్రదాయబద్ధమైన పాత్రలకు మాత్రమే జ్యోతి పరిమితమవుతూ వస్తోంది. ''ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే చేస్తాను'' అని ఎవరికైనా ముందుగానే కుండబద్దలుకొట్టినట్టు చెప్పేస్తుందట. ''హగ్ సీన్లు ఉంటే చెయ్యను, చాలా వరకు అలాంటి సీన్లు అవాయిడ్ చెయ్యడానికే డైరెక్టర్లు కూడా నాకు ఎంతో సహకరిస్తారు, స్టోరీ డిమాండ్ చేస్తుందనుకుంటే తప్పక చేస్తానంతే'' అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది జ్యోతి. నటించమని అడిగితే, ఎవరికైనా తను పెట్టే షరతు అదేనట.

అవార్డులు
అలా తను చేసిన సీరియల్స్‌లో 'మంగమ్మగారి మనవరాలు'లో సీతపాత్రకు జ్యోతికి ఉత్తమ న్యూ ఎంట్రీ హీరోయిన్ అవార్డు, ఉత్తమ మనవరాలు అవార్డు అభించాయి. అలాగే, ఉత్తమ కోడలు, బెస్ట్ పాజిటివ్ హీరోయిన్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
'చంద్రముఖి' సీరియల్‌లో నటనకుగాను ఉత్తమ డెబ్యూ హీరోయిన్ అవార్డు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సీరియల్‌కు బెస్ట్ విలన్ అవార్డు, భార్య సీరియల్‌లో ఆనందిపాత్రలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంటు పండించినందుకు ఉత్తమ చెల్లెలు అవార్డు జ్యోతికి అభించాయి.
''సినిమా, టీవీ రంగంలో ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఇంత పోటీలో కూడా నేను మంచి నటిగా సీరియల్స్‌లో ఇంత పేరు సంపాదించుకుంటూ కొనసాగడానికి కారణం ఆ దేవుడే'' అంటోంది జ్యోతి.
ఒకప్పుడు ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె కుటుంబం ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. నటజీవితంలోనూ, మానసికంగానూ జ్యోతి ఎంతో హ్యాపీగా ఉందట.
నెగిటివ్‌రోల్‌లోనే పెర్ఫార్మెన్స్ ఛాయిస్
పదిహేనేళ్ళుగా నటిగా ఈ రంగంలో కొనసాగుతోంది జ్యోతి. స్కూల్లో ఉన్నప్పటినుంచీ ఆమెకు దివంగత హీరోయిన్ సౌందర్య నటన అంటే ఎంతో ఇష్టమట. డైలాగ్స్–నటన ఏం చూసినా ఇట్టేపట్టేసేదట. వెంటనే ఆ డైలాగ్స్‌తో సహా యదాతథంగా నటించి చూపించేదట. స్కూల్లో స్నేహితులు ఆమెను బ్రతిమలాడిమరీ డైలాగ్స్ చెప్పించుకుని ఎంజాయ్ చేసేవారట. ఏకసంథాగ్రహిగా జ్యోతికి బాల్యంనుంచీ ఉన్న ఆ అలవాటువల్లనే, ఇప్పుడు ఎలాంటి సీన్‌ని అయినా సింగిల్ టేక్‌లో ఆన్ ద స్పాట్‌లో ఓకే చేసే స్థాయికి ఎదిగింది జ్యోతి.
''నాకు నెగిటివ్ రోల్స్ అయితేనే బాగుంటాయి. పెర్ఫార్మెన్స్‌కి అవకాశాలు ఎక్కువ. ఒకేపాత్రలో నెగిటివ్–పాజిటివ్ రెండు షేడ్సూ ఉండాలని కోరుకుంటాను. సీరియల్ అంటేనే లేడీ ఓరియంటెడ్ పెర్ఫార్మెన్స్. అందువల్ల డిఫరెంట్ షేడ్సూ చూపించడానికి ఇందులోనే వీలుంటుంది'' అని చెబుతోంది జ్యోతి.